రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి
తిరుమలగిరిలో జరిగిన భూ భారతి అవగాహన సదస్సులో ఎమ్మెల్యే జీఎస్సార్..
భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సులను రైతులందరూ తప్పక సద్వినియోగం చేసుకోవాలని *భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు* అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో తహశీల్దార్ శ్వేత ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సులో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సులను రైతులందరూ తప్పక సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. గతంలో ఉన్న ధరణిలో అనేక లోపాలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం గుర్తించి ధరణి స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు మేధావులు, రైతు సంఘాలు, అందరితో చర్చించి గత చట్టంలోని లోపాలను సవరిస్తూ కొత్త చట్టం భూ భారతిని తీసుకు వచ్చిందన్నారు. లోపభూయిష్టంగా ఉన్న ధరణి వల్ల పట్టాల జారీలో ఏదేని పొరపాటు జరిగితే అప్పీలు చేయడానికి ఆవకాశం లేదని, రైతులు సివిల్ కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చేదని దానివల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారం లోకి వస్తే ధరణి స్థానంలో భూ భారతి తెస్తామని చెప్పిన ప్రకారం సులువైన మరియు పటిష్టమైన చట్టాన్ని అమల్లోకి తెచ్చినట్లు తెలిపారు. భూ భారతి నూతన ఆర్ఓఆర్ రెవెన్యూ చట్టంపై పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాలోనే ఒక్క రేగొండ మండలాన్ని ఎంపిక చేసి రైతుల నుండి సలహాలు, సూచనలు, భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని మొత్తం 11 గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 8 గ్రామాల్లో సదస్సులు పూర్తి అయినట్లు తెలిపారు. హెల్ప్ డెస్క్ ను పరిశీలించి రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు. దరఖాస్తు స్వీకరించిన సమయంలోనే సంబంధిత రిమార్క్స్ కూడా నమోదు చేయాలని విచారణకు సులువుగా ఉంటుందని సూచించారు. దరఖాస్తుల విచారణ ప్రక్రియను వేగవంతం చేసి, ప్రజలకు త్వరితగతిన న్యాయం చేకూర్చేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రేగొండలో జరిగే భూ భారతి సదస్సుకు 10 లేదా 11వ తేదీన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరుకానున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.